15.12.09

"mahanatudu" NTR mahaprasthanam

Posted by patlolla


బాల్యం - విద్యాభ్యాసం:

జన్మించిన తేది : 1923 మే 28వ తేది, కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు గ్రామం
తల్లిదండ్రులు : లక్ష్మయ్య చౌదరి, వెంకట్రావమ్మ
చదివినది : 1947లో బి.ఎ. ఉత్తీర్ణత
మొదటి ఉద్యోగం : సబ్ రిజిస్టార్
కుమారులు : జయకృష్ణ , సాయికృష్ణ , హరికృష్ణ , మోహనకృష్ణ , బాలకృష్ణ , రామకృష్ణ , జయశంకర్ కృష్ణ
కుమార్తెలు : లోకేశ్వరి , పురంద్రీశ్వరి , భువనేశ్వరి , ఉమామహేశ్వరి
తొలి చిత్రం : 1949 లో "మనదేశం"
చివరి చిత్రం : మేజర్ చంద్రకాంత్
తెలుదుదేశం ఆవిర్భావం : 1982 మార్చి 29న మధ్యాహ్నం 2-30 గం.లకు.
ప్రభుత్వ ఆవిర్భావం : 1983 జనవరి 9వ తేది
మరణం :1996 జనవరి 18వ తేది

NTR with Mother & Brother
నందమూరి తారక రామారావు కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో 28-05-1923న జన్మించారు. తండ్రి లక్ష్మయ్య చౌదరి, తల్లి వెంకట్రావమ్మ. ఎన్.టి.ఆర్, పెద్దనాన్న రామయ్య-చంద్రమ్మ దంపతులకు సంతానం లేకపోవడంతో వారికి ఎన్.టి.ఆర్ దత్తపుత్రుడుగా మారిపోయారు. వాళ్ళ్లు చాలా గారాబంగాపెంచారు. ఇద్దరు తండ్రులూ, ఇద్దరు తల్లులకు ముద్దుల కొడుకుగా పెరిగాడు. వీరిది మోతుబరి రైతుకుటుంబం. ఎన్.టి.ఆర్ అక్షరాభ్యాసం నిమ్మకూరులోనే జరిగింది. నిమ్మకూరులో ఆరోజులలో ఐదవ తరగతి వరకే ఉంది. అదీ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాల. అతనికి ఓనమాలు నేర్పిన ఉపాధ్యాయుడు వల్లూరు సుబ్బారావు. పెద్దబాల శిక్ష మొదలుకొని భారత రామాయణాలను నేర్చుకొన్నాడు. సాహిత్య, సాంస్కృతిక సౌరభాలు శైవంలోనే గుభాళించాయి. పౌరాణిక సాహిత్యం పట్ల అనురక్తి ఆనాడే ఏర్పడింది. అతని గొంతు అందరికి ఆకర్షణీయంగా ఉండేది. చిన్నతనంలోనే బాలరామాయణం వల్లెవేయడంలో ప్రావీణ్యం సంపాదించారు. కంఠంలో ఓప్రత్యేకత ఉండేది. ముత్యాలవంటి దస్తూరీ ఉండేది. చిత్రకళలో కూడా మంచి నేర్పు సంపాదించారు. ఇక రూపం విషయంలో అతను స్పురద్రూపి. నిండుగా అందంగా ఉండేవారు. శ్రమైకజీవనసౌందర్య బీజాలు చిన్నతనంలోనే ఆయన మనస్సులో గాఢంగా నాటుకున్నాయి. చదువుకుంటూనే పొలం పనులకు వెళ్ళ్లేవారు. ఊరిలోని జాతరలలో నాటకాలువేసేవారు. అందులో అయన బాలరామాయణగానం ఒక ప్రత్యేకాకర్షణ. ఊళ్ళ్లోని ఐదవ తరగతి తర్వాత విజయవాడ వన్ టౌన్ లోని గాంధీ మున్సిపల్ హైస్కూల్లో ప్రవేశించారు. స్కూలు పైనల్ అక్కడే పాసయ్యారు. తర్వాత విజయవాడలోనే ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్ కాలేజీలో ఇంటర్ మీడియట్ లోప్రవేశించారు. అదే సమయంలో తండ్రి వ్యవసాయం దెబ్బతిన్నది. తండ్రి విజయవాడలోనే పాడిపశువుల పెంపకం చేపట్టారు. రామారావు చదువుసాగిస్తూనే సైకిల్ పై హొటళ్ళ్లకు పాలుపోసి వస్తూ తండ్రికి సహకరించేవారు.
NTR with Mother & Brother
ఇంటర్ లో విశ్వనాథ సత్యనారాయణ రామారావుకు గురువు. ఆయన రాసిన "రాచమల్లుని దౌత్యం" అనే నాటకంలో ఎన్.టి.ఆర్. నూనూగు మీసాలతోనే "నాగమ్మ" అనే హీరోయిన్ వేషం వేశారు. "మీసాల నాగమ్మ"గా బహుమతి కూడా కొట్టేశాడు. అలా జరిగిన తొలి రంగస్థల ప్రవేశం ఆయనలో కళారంగంపట్ల ఆసక్తిని పెంచింది. ఇంటర్ సెకండ్ ఇయర్లో "అనార్కలి"లో సలీంగా నటించి ప్రథమ బహుమతి పొందారు. ఆ ఉత్సాహంతోనే నేషనల్ ఆర్ట్ థియేటర్, ఎంగ్ ఆంధ్రా అసోసియేషన్ల ఆధ్వర్యంలో నాటక ప్రదర్శనలిచ్చి, ఔత్సాహిక కళాకారుడిగా రూపొందారు. 1942 మేలో మేనమామ కూతురు కొమరవోలు మునసబు కాట్రగడ్డ చెంచయ్య కూతురు బసవతారకంతో రామారావుకు 20వ యేట వివాహం అయింది. నాటకాభిరుచి, వైవాహిక జీవితంతో ఇంటర్ ఫేయిలయ్యారు. ఖాళీగా ఉండక చిన్న చిన్న ఉద్యోగాలూ, వ్యాపారాలూ చేశారు. సౌండ్ రికార్డింగ్ శిక్షణ కోసం బొంబాయి వెళ్ళ్లారు. అక్కడే ఒక ఆంధ్రామెస్ సడిపారు. ఇవేమీ లాభం లేక పోవడంతో మళ్ళ్లీ విజయవాడకు వచ్చి తండ్రి పాలవ్యాపారానికి తోడుగా పొగాకు-వ్యాపారం ప్రారంభించారు. కష్టపడి ఇంటర్ పాసయ్యారు. గుంటూరు ఎ.సి.కాలేజీలో బి.ఎలో జాయిన్అయ్యారు. అక్కడ కూడా ఆయన నటనాజీవితం కొనసాగింది. కొంగర జగ్గయ్య ఆయనకు ప్రత్యర్థి. ఇరువురు పరిషత్ పోటీలకు కూడా వెళ్ళ్లేవారు. కాలేజీలో వేసిన "నాయకురాలు" నాటకంలో ఎన్.టి.ఆర్. నలగామరాజు. దానితో అతను ప్రముఖ దర్శకులు సి.పుల్లయ్య దృష్టిలోపడ్డారు. అందగాడు, మంచికంఠం ఆకర్షించే నటన. ఇది చూసి పుల్లయ్య "సినిమాలో అవకాశం ఇస్తాను మద్రాసు రమ్మని" ఉత్తరం రాస్తే బి.ఎ పూర్తి కాకుండా సినిమాలలోకి రానన్నారు. 1947లో రామారావు బి.ఎ. పూర్తిచేశారు. అప్పటికే ఆయనకు ఒక కొడుకు రామకృష్ణ జన్మించాడు.

 నట జీవితం :
రామారావు శ్రేయోభిలాషి సుబ్రహ్మణ్యం రామారావును ఎల్.వి.ప్రసాద్ కు పరిచయం చేశాడు. ఆయనకు రామారావు నచ్చాడు. స్క్రీన్ టెస్టులకు మద్రాసు రమ్మన్నాడు. మద్రాసులో టెస్టులు చేసింతర్వాత, తర్వాత కబురు చేస్తాం వెళ్ళ్లిపొమ్మాన్నాడు. ఎన్.టి.ఆర్. నిరాశాతో ఉద్యోగంవేటలో పడ్డారు. మరో వైపు జగ్గయ్యతో కలిసి నాటకాలలో వేషాలు వేశారు. ఇంతలో ఎల్.వి.ప్రసాద్ "మనదేశం"లో చిన్న వేషం ఇస్తానంటే ఎన్.టి.ఆర్. నిరాశపడ్డారు. మరో వైపు 190/- రూ.ల జీతంతో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం దొరికింది. సినిమా కలలను తాత్కాలికంగా పక్కన పెట్టి గుంటూరు వెళ్ళ్లి ఉద్యోగంలో ప్రవేశించారు. అదే సమయంలో బి.ఎ.సుబ్బారావు(దర్శకుడు) తాను తీస్తున్న "పల్లెటూరు పిల్ల" సినిమాకు ఒక మంచి హీరో కోసం వెతుకుతున్నాడు. ఎల్.వి.ప్రసాద్ ఆయనకు రామారావు పేరును సిఫార్సు చేశాడు. "హీరో వేషం కోసం మద్రాసు రమ్మని సుబ్బారావు రామారావుకు ఉత్తరం రాశాడు. ఉత్త్తరం అందుకున్న ఎన్.టి.ఆర్. డోలాయమానంలో పడ్డాడు. నికరమైన ఉద్యోగమా, రిస్క్త్ తోకూడిన సినీ చాన్సా? తేల్చుకోలేని పరిస్థితిలో సినిమావైపు మొగ్గు చూపే పరిణామాలు కొన్ని సంభవించాయి. తన తమ్ముడు, ఇతర శ్రేయొభిలాషులూ సినీ అవకాశన్నే ప్రోత్సహించారు. దానికి తోడు అతనికి తన మనస్తత్వానికి గిట్టని అసహ్యకరమైన చేదు అనుభవాలు ఆఫీసులో ఎదురయ్యాయి. అక్కడ అడుగడుగునా ప్రతి పనికీ లంచం, మనుష్యుల తత్వాలు రోతపుట్టించాయి. మొదటి రోజునే ప్యూను తనవాటాగా తెచ్చి కోటు జేబులో పెట్టిన లంచం ఆయనకు నచ్చలేదు. తన అంతరాత్మకు వ్యతిరేకంగా నడుచుకోలేని ఎన్.టి.ఆర్. ఉద్యోగంలోని జీతం, జీవితం కంటే సినీ జీవితంలో రిస్క్ తీసుకోవడం ఉత్తమమనిభావించారు. 11రోజులు మాత్రమే చేసిన ఉద్యోగం వదులుకొని మద్రాసు రైలెక్కారు.

సినీవినీలాకాశంలో ధ్రువతార

NTR
మద్రాసులో శోభనాచల స్టూడియోలోకి అడుగుపెట్టి, ఒక 5'-10"ల అందగాడు గంభీరంగా నడిచివస్తుంటే "ఇలాంటివాడు నా చిత్రానికి హీరో అయితే ఎంత బాగుండును" అని బి.ఎ.సుబ్బారావు మనసులో అనుకుంటుండగానే", బి.ఎ.సుబ్భారావు గారు ఎక్కడ ఉంటారని ఎన్.టి.ఆర్. అడగడం తర్వాత వారి పరస్పర పరిచయాలూ ఇవన్నీ సుబ్బారావు మనస్సుమీద చెరగని ముద్రవేశాయి. స్క్రీన్ టెస్టులూ, ఇతర పరీక్షలూ ఏమీ అవసరంలేదని త్రోసిపుచ్చి సుబ్బారావు వెంటనే వెయ్యి నూటపదహార్లు అడ్వాన్సుగా ఇచ్చి కాంట్రాక్టుపై సంతకం చేయించుకున్నాడు. అదే ఎన్.టి.ఆర్. తొలి సంపాదన, అది ఆనాడు పెద్ద మొత్తం. హొటల్ రూం అద్దె 4/- రూ.లు, భోజనం 0-50పైసలు. ఇక అటు పల్లెటూరిపిల్ల ప్రారంభం కాకముందే రామారావు ఎల్.వి.ప్రసాద్ "మనదేశం"లో సబ్ ఇన్ స్పెక్టర్ పాత్ర ధరించి మొట్టమొదటిసారి నటించారు. "కష్టపడి కానిస్టేబుల్ స్ఠాయి నుండి సబ్ ఇన్ స్పేక్టర్ స్ఠాయికి ఎదిగాను" అనే ఒకే ఒక్క డైలాగు చెప్పి లాఠీ ఝుళిపిస్తూ నిజంగానే సమరయోధుల ఎక్స్ట్ ట్రా పాత్రధారులను బాది తరిమి కొట్టారు. ఒక్క ఈ తొలి సన్నివేశంలోనేకాదు 40 ఎండ్ల సినీజీవితంలో ఇలానే ఆవేశంతో, అంకితభావంతో నటించారు. ఎన్.టి.ఆర్. సినిమా చరిత్ర నాలుగున్నర దశాబ్దాలు. 1949 లో జైత్రయాత్ర "మనదేశం"తో ప్రారంభం అయ్యింది. మధ్యలో కొంత రాజకీయ విరామం. తర్వాత 1993లో "మేజర్ చంద్రకాంత్"తో ముగిసింది. ఇందులో కేవలం సినీజీవితం 33 సంవత్సరాలు. తొలి చిత్రం "మనదేశం"లో ఎంత ఆవేశంగా నటించారో చివరి చిత్రం "మేజర్ చంద్రకాంత్"లోనూ తన 70వ ఏట అంతే ఆవేశంగా, అంతే ఉద్వేగభరితంగా నటించారు. ఈ వేషంలో ఆవేశం లేకుంటే రామారావు లేడు. హావభావాలలోనూ ప్రతి అంశంలోనూ ఆత్మవిశ్వాసం తొంగిచూస్తుంది. ఆత్మగౌరవం కోసం ప్రాణాలనైనా వదిలాడు గాని ఆత్మగౌరవాన్ని వదలలేదు. జీవితాంతం ఆయన సాగించిన 73 ఎళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో అడుగడుగునా పోరాటమే. తనకు అసమంజసమని తోచిన ప్రతి సందర్భంలోనూ ఘనమే. చివరికి మరణం కూడా పోరాటం పరిణామమే.
NTR
తెలుగు సినీ రంగంలో, రాజకీయ రంగంలోనూ, మానధనుడైన రారాజుగా చిరస్మరణీయుడయ్యారు. ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్ ల జయాపజయాలే తొలి తెలుగు సినిమా చరిత్ర. సినిమా పరిశ్రమకు గుర్తింపు, గౌరవం, హోదా, డబ్బు, తెచ్చిపెట్టిన ఘనత వీరిద్దరిదే, సినిమారంగం ఒక పరిశ్రమగా అభివృద్దిగాంచడానికీ, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సినిమాలు నిర్మించే స్ఠాయికి ఎదగడానికి ఎన్.టి.ఆర్. రాత్రింబవళ్ళు చేసిన కృషి, అతని క్రమశిక్షణ సమయపాలన ముఖ్యకారణాలు. అలుపు లేకుండా నిర్విరామంగా షూటింగ్ లలో పాల్గొని "పని రాక్షసుడు"గా పేరుపొందారు. ఆయన హీరోగా నటించిన డజన్లకొద్దీ సినిమాలు విడుదల అయిన సంవత్సరాలు అనేకం. 1964 లో 15 చిత్రాలలో నటించారు. 2-30గం ల రాత్రే లేస్తారు. కాలకృత్యాలు, యోగ, పూజ మొదలయినవి పూర్తిచేసుకుని, భోజనం చేసి సూర్యోదయానికి పూర్వమే మేకప్ వేసుకుని సిద్దంగా ఉండేవారు. స్టూడియోలో షూటింగ్ పైనే దృష్టి అంతా. మరో ద్యాస ఉండేదికాదు. కాలం విలువ చాలా బాగా తెలిసినవారు. కాలాన్ని పనిరూపంలోకి మార్చుకున్నారు. దానితో డబ్బూ, హొదా, కీర్తి సంపాదించుకున్నారు. ఆయన మొత్తం చిత్రాలు 295. వీటిలో 278 తెలుగు, 14తమిళం, 3 హిందీ. ఆయన పాత్రలలో కనిపించినంత వైవిద్యం మరో హీరోలో కనిపించదు. హీరో, విలన్, తండ్రి, కుమారుడు ఇలా అన్ని పాత్రలనూ ఏకకాలంలొ రక్తి కట్టించారు. ఆయన సినిమాలకు వసూళ్ళ్లలో అగ్రస్ఠానం. అవి రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించాయి. విజయ-వాహినీ స్టూడియోలు ఆసియాలోనే అతిపెద్ద స్టూడియోలుగా అభివృద్ధి చెందడానికి ఆయన తొలి సినిమాలు ఎంతో దోహదంచేశాయి. అనీ జూబ్లీ సినిమాలే ఆయన తొలి పారితోషికం ఐదువేలు, చివరి దశలో పాతిక లక్షల వరకూ తీసుకున్నారు. ఆయన ఒక వ్యక్తి కాదు. ఒక వ్యవస్థ. కళాకారుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన పట్టిందల్లా బంగారం అయింది. రాశిలోనేగాదు, వాసిలో కూడా ఆయన సినిమాలది అగ్రస్ఠానం. ఎన్.టి.ఆర్. నటించినన్ని పౌరాణిక చిత్రాలు ప్రపంచంలో మరే ఇతర నటుడూ నటించలేదు. రామునిగా, కృష్ణునిగా, వేంకటేశ్వరునిగా ఆయన పాత్రలను ప్రజలు అపరభగవంతునిగా ఆరాధించారు. ఒకే సినిమాలో నాయక, ప్రతినాయక పాత్రలు ధరించిన ఘనత కూడా ఆయనదే 43 పౌరాణికాలు, 12 చారిత్రకాలు, 55 జానపదాలు, 185 సాంఘీకాలు ఆయన చిత్రాలు. అందులో 141 శతదినోత్సవాలు లేక రజతోత్సవాలు జరుపుకున్నాయి. ఆరు సినిమాలు స్వర్ణోత్సవాలు జరుపుకున్నాయి. "లవకుశ 75 వారాలు ప్రదర్శించి రికార్డు సృష్టించింది. క్యాలెండరును తిప్పేసిన తొలి తెలుగు సినిమా"అది "నటరత్న" "పద్మశ్రీ" "విశ్వవిఖ్యాత నట సార్వభౌమ" బిరుదులు ఆయనకు లభించాయి.

చిత్రనిర్మాణం, దర్శకత్వం నటనపై ఎన్టీఆర్ పంథా

NTR
ఎన్నో చిత్రాలకు రామారావు గారే దర్శకత్వం వహించి,రామారావు గారే నటించి,చిత్రనిర్మాణం తాలూకు సమస్తమైన బాధ్యతలు నిర్వహించిన ఎన్టీఆర్ దినచర్య ఎలా వుంటుంది అని ఒకసారిఅడిగితే ఆయనంటారు... నేను ప్రతిరోజూ రాత్రి ఖచ్చితంగా మూడుగంటలకు మేల్కోంటాను. అప్పుడు ప్రకృతి,మనుషులు అందరూ నిద్రావస్థలో వుంటారు. వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కాలకృత్యాలు ముగించి వచ్చి నాపనిలో కూర్చుంటాను. అప్పటికి మూడున్నర అవుతుంది. నాలో అంతర్మధనం ప్రారంభమౌతుంది. ఈ మధనం నా జీవితాన్ని గురించి కాదు ,కేవలం నటన గురించి పాత్ర్రలగురించి, వాటి స్వరూప స్వరూపాల గురించి ఆలోచిస్తాను. ఆ సమయాన్ని నేను నా ఆలోచనకాలంగా ఎన్నుకోవడానికి ఒక ముఖ్యమైన కారణం. అదేమిటంటే ఒక విషయాన్ని గురించి ఆలోచించేటప్పుడు ఒక చిన్న శబ్దాన్ని కూడా భరించలేను. నేను నా ఏకాగ్రతకు భంగం వాటిల్లితే సహించలేను. అందుకే ఆ సమయాన్ని ఎన్నుకొన్నాను. సంవత్సరాలుగా ఆచరిస్తూ వస్తున్నాను. నా జీవితాంతం ఆచరిస్తాను. నేను ఒక చిత్రాన్ని నిర్మించ దలుచుకున్నప్పుడు ఆ చిత్రంలో నేనే నటిస్తూ దర్శకత్వం వహించ దల్చుకున్నప్పుడు ముందుగా స్ర్కిప్ట్ అంతా సిద్ధం చేసుకుంటాను. పాటలు రాసే విషయంలో,మాటలు రాసే విషయంలో ఆయా రచయితలకు పూర్తి స్వేచ్చనిస్తాను. ముందుగా ట్యూన్ కంపోజ్‌ చేసి తరువాత పాటరాయించే అలవాటు నాకులేదు. అలా రాస్తే ఆ పాటలు బావుంటాయా?లేదా అన్న విషయం అటుంచితే రచయిత స్వేచ్చను కోల్పోతారు. కళాకారుడికి నిర్భంధాలు వుండకూడదు అని నమ్మేమనిషిని నేను. అలా రచయితలు తమ ఇష్టప్రకారం స్ర్కిప్ట్ అంతా సిద్దపరిచాక దాన్ని స్వహస్తాలతో తిరగరాసుకుంటాను. అలారాసినప్పుడు ఆ డైలాగ్ మీద పూర్తి కమాండ్ వచ్చేస్తుంది. మొదటి డైలాగ్ నుంచి చివరి డైలాగ్ వరకు,మొదటి షాట్ నుంచి చివరి షాట్ వరకు వివరంగా డైరెక్టర్స్ డైరీ లాంటి పుస్తకం తయారవుతుంది. సెట్ మీదకు వచ్చాక ఆ స్ర్కిప్ట్ మార్చే ప్రసక్తే వుండదు.ఏయే ఆర్టిస్ట్‌లను ఎన్నుకోవాలి, డైలాగ్ ఏలా పలకాలి, ఏ షాట్ ఎలా చిత్రీకరించాలి, అనే విషయం మీద ముందుగా నిర్ణయాలు తీసుకుంటాను. నా చిత్రం సెట్స్ మీదకు వెళ్లక ముందే మొత్తం చిత్రం నా మనో ఫలకంమీద ముద్రితమై వుంటుంది. అందుకే నా చిత్రానికి నేనే మొదటి ప్రేక్షకుడిని.ఒకవేళ అలా మొత్తం చిత్రాన్ని చూడలేకపోతే అ వ్యక్తి దర్శకుడు కాలేడు. అతని పనిలో నైపుణ్యం వుండదు” అంటారు ఎన్టీఆర్ గారు.

స్వర్గీయ కే.వి.రెడ్డిగారు కథ చెప్పమంటే చెప్పేవారు కాదు. షాట్ డివిజన్ ,సినిక్ ఆర్డర్ కూడా చెప్పేవారు కాదు. మిస్టర్ రామారావ్!రీడ్ ది స్ర్కిప్ట్ అని పుస్తకం చేతికిచ్చేవారు. ఆ పాత్ర స్వరూప స్వభావాలు కథ, కావల్సిన ఎఫెక్ట్స్ అన్నీ వివరంగా రాసివుండేవి. నా ఉద్దేశంలో అదొక గొప్ప సంప్రదాయం. ఒక అర్టిస్ట్‌కు కథ వినిపించేకంటే అతని చేత పూర్తి స్ర్కిప్ట్ చదివించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆయా పాత్రల గురించి ఆర్టిస్టు తనంతట తనే తెలుసుకుంటాడు. నేను అలాగే తెలుసుకునే వాడిని. చిత్రం సెట్స్ మీదకు వెళ్లక ముందే మొత్తం డైలాగ్స్ కంఠోపాఠం అయివుండేవి. సెట్స్ మీదకు వెళ్ళాక ఏవిధమైన కంగారు,హడావుడి, ఒడిదుడుకులు లేకుండా నిర్మాణం జరిగేది. చిత్రం అనుకున్న దానికంటే గొప్పగా రూపొందేది.
NTR
కె.వి.రెడ్డిగారి వద్ద అనాడు నేర్చుకున్న సాంప్రదాయం ఆచరణలో పెడుతున్నాను. ఇప్పుడు నేను నా చిత్రంలో ఆర్టిస్టులకు కథ చెప్పను. స్ర్కిప్ట్ చేతికిచ్చి చదువుకోమంటాను. సెట్స్ట్ట్ మీదికి వచ్చాక ఇతర విషయాల గురించి ఆలోచనగానీ,చర్చగానీ జరిగితే సహించను. ఎంతటి ముఖ్యమైన విషయాలైన గానీ సెట్స్ బయటే. సెట్స్ మీదికి వెళ్లాక కేవలం నటనగురించి, పాత్ర స్వభావం గురించి మాత్రమే ఆలోచించాలి అంటాను. నాకు ఏవిధమైన నటన కావాలో ముందుగానే చెబుతాను. నాకు కావలసిన ఎఫెక్ట్స్ రాబట్టుకుంటాను అంటారు రామారావు గారు.

ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అన్న విధంగా కాక,తను ముందుగా ఆచరించి తరువాత ఎదుటివారికి చెబుతారు ఎన్టీఆర్ గారు. నటనలో సుధీర్ఘమైన అనుభవం వున్న ఎన్టీఆర్ సినిమారంగం నుంచి నిష్క్రమించే చివరి రోజు వరకు కెమేరా ముందుకు వెళ్లే ముందు కూడా విపరీతంగా సాధన చేశారు. ఒక్క నిముషం ఖాళీ దొరికితే చాలు ఆయనగారు నటించబోయే సన్నివేశం తాలూకు రిహర్సల్స్ చేస్తుంటారు. అది చూస్తుంటే నటన పట్ల,పాత్ర పట్ల ఆయనకుండే ఏకాగ్రతకు ఆశ్చర్యమేస్తుంది.“రాత్రి రెండున్నరకు లేచింది మొదలు అయిదు గంటలవరకు ఇలాంటి విషయాలన్నీ ఆలోచిస్తాను” అంటారు ఎన్టీఆర్ గారు.

దర్శకుడిగా,నటుడిగా నేను చేయవలసిన పని తాలూకు చిత్రం నా మనసులో సిద్దంగా ఉంటుంది. ఐదుగంటలకు మేకప్ రూమ్‌లోకి వెళ్తాను. నా మేకప్ పూర్తయ్యేసరికి ఆరున్నర అవుతుంది. ఆరున్నరనుంచి ఎనిమిదిన్నరవరకూ నాకోసం వచ్చిన అతిధి అభ్యాగతులతో గడుపుతాను. ఎనిమిది నలభై అయిదు నిముషాలకు ఇంట్లోంచి బయలుదేరి సెట్స్ మీదకు వచ్చేస్తాను. చాలా హాయిగా ప్రశాంతంగా చిత్రీకరణ ప్రారంభిస్తాను. చిత్రీకరణలో పాల్గొంటాను అంటారు ఎన్టీఆర్ గారు.

“మనిషి ఎంత చదువుకున్నా,ఎంతటి గొప్ప ప్రతిభా పాటవాలున్నా క్రమ శిక్షణ లేకుంటే అవేవీ రాణించవు. క్రమశిక్షణతో సాన పట్టకపోతే ప్రతిభ అనే వజ్రం ప్రకాశించలేదు. మరో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంత హాయిగా చిత్రాన్ని తీయటానికి సంవత్సరం,సంవత్సరంన్నర పడుతుంది.ఇది కూడా కే.వి.రెడ్డి గారి సాంప్రదాయామే. ఈ సాంప్రదాయానుసారం తీసిన చిత్రం మాత్రమే పరిపూర్ణంగా ఉంటుంది. దర్శకుడు ఎంత సృజానాత్మక శక్తి గల మేధావి అయినప్పటికి సంవత్సరానికి ఒక చిత్రం తీయలేడు. సంవత్సరానికి నాలుగైదు చిత్రాలు తీసే దర్శకుల మీద నాకు నమ్మకం లేదు” అంటారు ఎన్టీఆర్.

అహారం ఆరోగ్య విషయంలో ఎన్టీఆర్ జాగ్రత్తలు

NTR
అయిదడుగుల పదంగులాలు ఎత్తు వుండి 80కేజీల బరువు రామారావు గారిది. ఆయన ధరించే పాత్రలకు అన్ని విధాల సరిపోయేందుకు తగిన పర్సనాలిటి . అది ఆయనకొక వరం అంటారు సినీనటుడు జగ్గయ్యగారు. అలా తన శరీరాన్ని తన అదుపులో వుంచుకోవడానికి చాలా శ్రమపడతారు . అందుకు ఆయన తీసుకునే ఆహారం విషయంలో కూడా ఎంతో శ్రద్దవహిస్తారు. “ఉదయాన్నే సెట్స్ మీదికి వెళ్ళే ముందు ఒక్క ముద్ద గోదుమ అన్నం,లేదా ఆమ్లెట్,ఇడ్లీలు,లేదా పెసరట్టు లేదా దోసె ఆతర్వాత టీ ఇది ఉదయం ఫలహారం. మధ్యాన్నం చాపాతీలు, చికన్,ఒకటి రెండు కూరగాయలు భోజనంగా తీసుకుంటాను.రోజుకు ఒక్క పూటే భోజనం.రాత్రికి భోజనం చేయను. ఎప్పుడైనా ఇష్టమైతే పాలు, పళ్ళరసం తీసుకుంటాను. పౌరాణికాల్లో నటించేటప్పుడు ఒంటి మీద అభరాణాలు మేకప్ వున్నంతవరకు నేను ఏదీ తీసుకోను. సాంఘీక పాత్రలు పోషించేటప్పుడు మాత్రం మేకప్ తోనే మధ్యాహ్నం భోజనం చేస్తాను. దేవుడి పాత్రలు వేసినప్పుడు మాత్ర్రం మాంసాహరాన్ని పూర్తిగా మానివేస్తాను. పడుకునేటప్పుడు పరుపును కూడా ఉపయోగించను. కేవలం చాపపైనే పడుకుంటాను. రావణుడుగా,దుర్యోధనుడుగా నటించేటప్పుడు మాత్రం మాంసాహారం స్వీకరిస్తాను అంటారు ఎన్టీఆర్.ఈ వంటకాలన్ని ఎన్టీఆర్ అర్ధాంగి బసవరామ తారకమ్మగారు స్వయంగా చేసి కేరియర్ పెట్టి పంపేవారు.

“ఒక్క పూట భోజనంలో ఎలా వుండగలుగుతున్నారు” అనే ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం ఇస్తూ “తన అధీనంలో వున్న మనుషికి ఆహారంతో అంతగా పని అవసరం వుండదు. నా శరీరంలోని ప్రతి అణువూ నా అధీనంలో వుంది. నేను ఒక్క పూట భోజనం చేసినా చేయకపోయినా నాలో నీరసం కానీ, నిస్సత్తువకానీ వుండదు. చాలా ధ్రుడంగా చలాకీగా వుంటాను. దీనికి కారణం నా మనసు,నన్ను సదా ధ్రుడంగా ఆరోగ్యంగా వుంచుతుంది. అంతే కాదు ఎలాంటి ఆహారం లేకుండా పాతిక రోజులు వుండగలను. అప్పటికీ ధ్రుడంగా వుంటాను” అంటారు.

రాత్రి త్వరగా పడుకోవడం, ఉదయం త్వరగా అంటే తెల్లవారుజామున మూడుగంటలకే నిద్ర మేల్కోవడం, నియమం తప్పకుండా వ్యాయామం చేయడం, అసనాలు వేయడం, ఆయన దైనందిన దినచర్యలో భాగం. దానికి తోడు పూజ చేయడం ఎప్పుడూ మానలేదు. మద్యాన్ని ఎప్పుడూ స్వీకరించలేదు. ఆయన సిగరెట్ పీల్ఛేవారు కాదు. కాని గొంతు విషయమై చుట్ట కాలిస్తే శ్లేష్మం పోయి జీర రాకుండా ఉంటుందంటే కొన్నాళ్ళు చుట్ట కాల్చారు. అయితే అది కూడా త్వరగానే మానేశారు. తమలపాకులు వేసుకునేవారు. దాని వల్ల పళ్ళు పాడయ్యే ప్రమాదం వుందని మానివేయమని ఎల్.వి.ప్రసాద్ గారు సలహాయిస్తే అదికూడా మానివేశారు. తన సహచరులతో, సంబంధము వున్న ప్రతి వ్యక్తితో గౌరవంగా ప్రవర్తించేవారు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ జీవితంలో భయంకరమైన ప్రమాదాలు

NTR
షూటింగ్ సమయంలో ఆయనకు నాలుగుమార్లు చెయ్యి విరిగింది. ఒకసారి పాము కరిచింది. ఒకసారి కుక్క కరిచింది.ఇంకోసారి ఎడ్లబండి ఎదపై నుండి వెళ్ళింది. ఇంకోసారి కత్తి దెబ్బతగిలింది. ఇలా భయంకరమైన ప్రమాదాలు జరిగినా మళ్ళీ చిత్రీకరణకై సిద్దంగా ఉండేవారు ఎన్టీరామారావుగారు. ఒక ముఖ్యమైన సంఘటన 1956వ సంవత్సరంలో జరిగింది. “చిరంజీవులు” చిత్రం షూటింగ్‌లో ఎన్టీరామారావుగారికి ఒక ఘోరమైన ప్రమాదం సంభవించింది. ఎన్టీఆర్ అ చిత్రంలో గ్రుడ్డివాడుగా నటించవలసి వచ్చినప్పుడు కళ్ళలో కాంటాక్ట్‌ లెన్స్ వాడవలసి వచ్చింది. దానివల్ల ఏ కారణం చేతనో కళ్ళు పూర్తిగా కనబడకుండాపోయాయి. దానికి గాను నందమూరి రాముడు మూడు రోజులు తన గృహములోని గది నుండి బయటకు రాలేదు. ఆ విషయం గురించి తెలుసుకోగా ఆ మూడు రోజులు కేవలం నా కళ్ళు నాకిప్పించమని దైవాన్ని ప్రార్థించాను అన్నారు.అంతే ఆ భగవంతుడు ఆయన ప్రార్ధనను మన్నించాడు కాబోలు!అంత జరిగినా మళ్ళీ చిత్రీకరణకు ధైర్యంగా నిలిచి ఆ చిత్రం పూర్తి చేశారు.అదీ అన్న గారి స్టామినా !

ఎన్టీఆర్‌ అమితంగా ఇష్టపడే రావణ పాత్ర

NTR
ఎన్టీఆర్‌‌గారికి బరువైన పాత్రలంటేనే అమితోత్సాహం. పాత్రకు సరియైన న్యాయం చేకూర్చాలనే అభిలాష తపన ఉండటం వల్ల పాత్రలో ఆయన జీవించేవారు.భీష్ముడి వంటి గాంభీర్యం,ఔదార్యం ఉట్టిపడే పాత్రాలన్నా ఎప్పటికీ నాకు మక్కువే అంటారు ఎన్టీఆర్ గారు. అభిమాన పాత్ర ధరించి అభిలాష తీర్చుకోనడం కన్నా ఏ నటుడూ ఆశించేది మరోకటి లేదు.నటనకు చోటు దొరికే బలమైన పాత్రలంటే నాకు చాలా ఇష్టం అంటారు .

తొలిసారి భూకైలాస్ చిత్రంలో రావణపాత్ర ధరించినప్పటి నుంచి నాకు అదో విశిష్టపాత్రగా గోచరించింది. రావణ అనగానే స్పూరించేది వికృతమైన భయకర స్వరూపం ,స్వభావం.సామాన్య దృష్టికి రావణుడు ఉగ్రకోపి,క్రూరుడు అయిన రాక్షసుడుగా కన్పిస్తాడు.కానీ రామాయణం తరచి చూసినా, పూర్తిగా అర్ధం చేసుకున్నా మనకు తోచేది,కనిపింఛేది ఆ ఆకృతి వేరు. శ్రీమహవిష్ణువే అతని అంతానికి అవతారమెత్తవలసి వచ్చిందంటే నిజానికి ఆయనెంత దురంధరుడో ఊహించుకోవచ్చు. తలచినదే తడవుగా కైలాస వాసుణ్ణి ప్రత్యక్షం చేసుకో గల్గిన మహా తపస్వి.ఇందుకు తగిన పురాణకావ్య నిదర్శనాలు, జనశృతులు ఎన్నో వున్నాయి. దశకంఠ రావణ విరచితమైన మహాన్యాసం వల్లించనిదే మహాదేవుని అర్చన పూర్తికాదు. అతనెంత సంస్కృతి కలవాడో చూడండి. అతని పాండితిలో లౌకిక పరలౌకిక శిఖరాలు మహోన్నతమైనవి. ఆధ్యాత్మిక చింతన తనకు అతీతమైన దైవత్వం పట్ల భక్తి విశ్వాసాలు అతనిలో ఉన్నాయి. రసజ్ఞుడుగా, కళా ప్ర్తపూర్ణుడుగా అద్వితీయుడు. త్రిలోకాలలోనే సాటిలేని వైశికుడు. సామవేదకర్త తనపై అలిగిన శంకరుని ప్రీతికి పొట్టచీల్చి ప్రేగులతో రుద్రవీణ కట్టి జీవనాదంతో పార్వతీశుని తన ముందుకు ప్రత్యక్షం చేసుకోగల్గిన సంగీత కళా తపస్వి అంటారు ఎన్టీఆర్‌గారు.

ఇక శాస్త్రజ్ఞ్డుడుగా మాత్రం రావణుడు సామాన్యుడా! ఈనాడు మన శాస్తజ్ఞులు సభోమండాలాన్ని చేరాలని కలలు కంటున్నారు. కానీ అతనేనాడో చూసిన శాస్త్రవేత్త. పరిజ్ఞాని. వాతావరణాన్ని ,ఋతుక్రమాన్ని హస్తగతం చేసుకొని తన రాజ్యాన్ని సుభిక్షం చేసుకున్న స్థితప్రజ్ఞుడు. అనేక మారణాయుధాలను, తంత్రాలను,క్రియకల్ప విద్యలను ఆకళించుకున్న శాస్త్రవేత్త. పుష్పక విమానంలో వాయుగమనం చేసుకున్నాడని వర్ణించారు. మేఘనాథుని జననకాలంలో వక్రించిన శనిపై కినిసి గధా ఘాతంతో కుంటివానిని చేయడమే అతని జ్యోతిషశాస్త్రం ప్రజ్ఞకు నిదర్శనం.

అవేశంలో ముక్కోటి ఆంధ్రులను తలపించే ఈ రావణ బ్రహ్మ ఐరావాతాన్నే ఢీకొనడం, అలిగిన వేళ కైలాసాన్నే కంఠాలపై మోయడం అతని భుజబల దర్పానికి గుర్తులు. రావణుడు కారణజన్ముడైన మహనీయుడు. పట్టినపట్టు విడువని కార్యసాధకుడు. అభిమానాన్ని ఆరాధించే అత్మాభిమానం ఏ పరిస్థితులకూ తలొగ్గని ధీరుడు. అతడిని ఈ రూపేణ తలుచుకోనడం పుణ్య సంస్మరణ.

బ్రహ్మతేజస్సుతో నిర్విక్ర పరాక్రమ బలదర్పితుడై, మహా పండిత ప్రకాండుడై శివపూజా దురంధరుడై శాస్త్రవేత్త అయిన మహాతపస్వి . అయినా అంతటి మహోదాత్తుడు రాక్షసుడుగా శఠుడుగా పరిగణించబడడానికి గల కారణమేమిటి?

అతని వైష్ణవ ద్వేషం ముఖ్యంగా ఒక కారణం. తాను శైవుడు కావడంలో తప్పులేదు.విష్ణుద్వేషిగా హింసాకాండకు ఉపక్రమించడమే అతడంటే మనం భయబ్రాంతులయ్యేటట్లు చేసింది. పరనారీ వ్యామోహమే నలకూబరుల శాపానికి దారి తీసింది. అతని పతనానికి కారణమైంది. ఈ రెండూ అతనిపై దెబ్బతిసినట్లు మరేమి తీయలేదు. ఇతరులంటే నిర్లక్ష్యం,చులకన చేయడం,నందిశ్వరునికి శాపానికి దారితీసింది. అతని వంశమంతా వాసర బలంతో హతమయ్యింది.

ఎన్టీఆర్ గారంటారు, నాకతడు దుర్మార్గుడుగా కనిపించడు. పట్టుదల కలవాడుగా కనిపిస్తాడు. అతనిలో లేని రసం లేదు. కావలిసినంత సరసం, ఉండరానంతా విరసం ఉన్నాయి. జీవనటులలో మేటి, అటువంటి పాత్ర అపురూపమైనదని నా నమ్మకం. అలాంటి పాత్ర్ర ధరించాలని నా అభిలాష. అదే నన్ను రావణ పాత్ర ధారణకు ప్రోత్సహించింది. కుండెడు పాలలోనైనా ఒక విషం బొట్టు పడితే పాలన్ని విషమైనట్లు ఇన్ని సద్గుణాలు కల్గినా, సద్ర్బాహ్మణ వంశ సంజాతుడైన రావణునిలో ఒక్క దుర్గుణమే అతని నాశనానికి దారితీసింది.

‘రావణ పాత్ర సర్వావేశ సంకలితం. ఆనందం,అవేశం,అనుగ్రహం,అగ్రహం,సహనం, అసూయ,భక్తి,ధిక్కారం ఇన్ని ఆవేశ కావేశాలు రావణుని తీర్చిదిద్దాయి. ఈ పాత్ర సజీవం కావడం వల్లనే నన్నింతగా అకర్షించింది. ఈ రావణుని మహాపాత్ర ధరించగల్గినందుకు ధన్యుడననుకుంటాను. రావణుని పరస్పర విరుద్ద ప్రవృత్తులన్ని వ్యక్తీకరించడానికి ప్రయత్నించా’అంటారు ఎన్టీఆర్ గారు. పౌరాణిక గాధలలో కనిపించే అద్భుతమైన పాత్ర్లలలో రావణ పాత్ర ముఖ్యమైనది అంటారు అన్నయ్యగారు.

అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో పాల్గొన్న ఎన్.టి.రామారావు గారి చిత్రాలు

NTR
1.భారతదేశంలో 1952 జనవరి 24న ప్రారంభమైన తొలి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుండి ఎంపికైన ఎకైక చిత్రం పాతళబైరవి. ఈ అంతర్జాతీయ చిత్రోత్సవాలు బొంబాయి,న్యూడిల్లీ,కలకత్తా,మద్రాస్ నగరాలలో ఏకకాలంలో జరిగాయి.
2.మల్లీశ్వరి సినిమా 1952వ సంవత్సరం బీజింగ్ లో జరిగిన చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. 1953 మార్చి 14న చైనీస్ సబ్ టైటిల్స్ చేర్చి 15 ప్రింట్లతో చైనాలో విడుదల చేశారు.
3.మహామంత్రి తిమ్మరసు చిత్రం 1963 లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైనది.
4.లవకుశ సినిమా 1964లో జకర్తాలోనూ 1965లో మాస్కోలోనూ జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది.
5.నర్తనశాల చిత్రం 1964లో జకర్తాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది.
6.ఉమ్మడి కుటుంబం 1968లో మాస్కోలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది.
7.కంచుకోట సినిమా 1968లో బెర్లిన్ చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది.
8.దేశోద్దారకులు చిత్రం 1974లో కైరో లో జరిగిన చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైంది.

ఎన్.టి.రామారావు జాతీయ అవార్డు గ్రహీతలు

NTR
తెలుగుజాతి అత్మగౌరవాన్ని దశదిశలా చాటిన మహానటుడు యన్.టి.రామారావు గారు. ఆయన పేరిట 1996లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ అవార్డును నెలకొల్పింది. దేశంలోనే అత్యధికంగా ఐదు లక్షల రూపాయల నగదు బహుమతితోపాటు ఎన్టీఆర్ జాతీయ అవార్డును,ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. యావద్భారత చలన చిత్రరంగంలో విశేషంగా క్రుషి చేసిన నటీ నటులకు ప్రదానం చేస్తుంది. ఇప్పటి వరకు ఈ అవార్డును అందుకున్న ప్రముఖులు వీరే.

*1996 అక్కినేని నాగేశ్వరరావు
*1997 దిలీప్ కుమార్
*1998 శివాజీగణేశన్
*1999 లతామంగేష్కర్
*2000 హృషికేశ్ ముఖర్జి
*2001 భానుమతి రామకృష్ణ
*2002 రాజ్ కుమార్

యన్టీఆర్ స్టార్ లైట్స్

తొలి జానపద చిత్రం ‘చింతమణి’ (1933)
తొలి చారిత్రక చిత్రం ‘సారంగధర’ (1937)
తొలి కలర్ చిత్రం ‘లవకుశ’ (1963)
తొలి పాక్షిక కలర్ చిత్రం అప్పు చేసి పప్పు కూడు (1959)
తెలుగులో నిడివి గల చిత్రం ‘దానవీరశూర కర్ణ (1977)
తెలుగు నుండి ఎక్కువ భాషాల్లో రీమేక్ అయిన చిత్రం ‘రాముడు భీముడు’ (1964)
తొలి త్రిపాత్రాభినయ చిత్రం కుల గౌరవం (1972) ఎన్.టి.రామారావు గారు
ఏకైక పంచపాత్ర్రాభినయ చిత్రం ‘శ్రీమద్విరాట పర్వం (1979)
టైటిల్ లో ఎక్కువ అత్యధిక అక్షరాలు గల చిత్రం‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ ( 1984)
100 చిత్రాలు తెలుగులోనే కాక, భారతదేశంలోనే తొలిసారి నటించిన హీరో యన్టీఆర్: గుండమ్మ కథ' (1962)
200 చిత్రాలలో నటించిన తొలి తెలుగు హీరో యన్టీఆర్ : ‘కోడలు దిద్దిన కాపురం (1970)చిత్రంతో
300 చిత్రాలలో నటించిన తొలి తెలుగు హీరో యన్టీఆర్ : ‘మేజర్ చంద్రకాంత్’ (1993)చిత్రంతో

సహజ అలంకరణలకు ఎన్.టి.ఆర్ ప్రాధాన్యం

NTR
వస్త్రాలంకరణ, కేశాలంకరణ(హెయిర్ స్టైల్), కిరీటాలు, మేకప్ గురించి ఎన్టీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. పౌరాణిక చిత్రాలలో కార్ట్‌బోర్డ్‌తో చేసిన కిరిటాలనే లోగడ ఎక్కువగా వాడేవారు. ఇత్తడి మొదలైన లోహకిరిటాలు ఎక్కువ బరువు వుండటం వలన కళాకారులకు అయాసం ఎక్కువౌతుందని అవి వాడేవారుకారు. ఎన్టీఆర్ మాత్రం కార్ట్‌బోర్డ్‌తో తయారు చేసినవి వాడకుండా లోహకిరిటాలనే వాడేవారు. వాటి బరువు మూడు కిలోలకు తక్కువ బరువు వుండేదికాదు. ఆయనకు కార్ట్‌బోర్డ్ తో తయారు చేసిన కిరిటాలు తీసుకెళ్ళి ఇస్తే “నేను ఎలా నటించాలి ఈ కృత్రిమ కిరిటాలతో? ఇలా పౌరాణిక చిత్రాలలో నటించడమంటే నాకు నచ్చదు. సహజంగా ఉండాలి గనుక లోహకిరిటాలనే తెప్పించండి” అనేవారు.

తెలుగు చిత్రసీమలో ఎస్.వి.రంగరావుగారు చాలా ప్రఖ్యాతి గన్ననటుడు. ఆయన పౌరాణిక చిత్రాలలో క్రూరపాత్రలు ధరించేటప్పుడు కార్ట్‌బోర్డ్‌తో తయారు చేసిన కిరిటాలు కాకుండా లోహ కిరిటాలు తేస్తే “నాన్‌సెన్స్, ఇంత బరువున్న కిరీటాలు ధరించి నటించడం ఎంత కష్టమో తెలుసా? ఇంత రిస్కు నాకెందుకు, వెళ్ళు కార్ట్‌బోర్డ్‌తో తయారుచేసిన కిరిటాలు తెండి” అని చెప్పేవారు. రామారావుగారికి ఇతరులకు ఉన్నతేడా అది. ఎన్టీఆర్ వాడే కిరిటాలకు బంగారం పూత కూడా వేయించి సిద్దం చేయించేవారు.

వృధా ఖర్చు నేను సహించను...యన్.టి.ఆర్

NTR
మనం ఎయిర్ కండీషన్డ్ గదుల్లో వున్నామా..విమానాల్లో ఎగిరోచ్చామా...పంచభక్ష్యపరమాన్నాలు తిన్నామా.. అన్నది ముఖ్యంకాదు. తెర వెనక జరిగే ఈ విలాసాలు తెర మీద కనిపించవు. ఈ విలాసాలకు అయ్యే డబ్బుతో ఒక అందమైన సెట్ వేస్తే తెర మీద కనిపిస్తుంది. మంచి అభరణాలు,దుస్తులు నటీనటుల చేత ధరింప జేస్తే కనిపిస్తాయి. లక్షలాది ప్రేక్షకులు చూస్తారు. అభిమానులు అదరిస్తారు. మనం చేసిన శ్రమ తెర మీద కనిపించి అభిమానులు ఆనందంగా స్వీకరించి నప్పుడే ఆ శ్రమకు ,పెట్టిన డబ్బుకి ఒక అర్థం వుంటుంది. సార్థకత లభిస్తుంది. అందుకే నేను సెట్స్ కోసం, దుస్తుల కోసం ,తెర మీద కనిపించే ప్రతి చిన్న అందం కోసం కోట్లరూపాయలు ఖర్చయినా లెక్కచేయను. కానీ తెర మీద కనిపించని విషయాలకు ఒక్కపైసా వృధాగా ఖర్చయినా నేను సహించను.నిర్మాతగా ఇది నా సిద్దాంతం. ఒక్క మాటలో చెప్పాలంటే లైట్స్ ఆన్ అయినప్పుడే ఏ విలాసమైనా,లైట్స్ ఆఫ్ అయ్యాక జరిగే ఖర్చు నా ప్రొడక్షన్ బుక్‌లోనికి ఎక్కదు.ఎవరైనా ఖర్చు చేయదలచుకుంటే తన స్వంత డబ్బుతో చేసుకోవలసిందే. ఇలాంటి వ్యవహారాల్లో చాలా ఖచ్చితంగా వుంటాను. చివరికి నా పిల్లలను కూడా వృధా ఖర్చులకు అనుమతించను అంటారు అన్నగారు.

షూటింగ్ సమయంలో యన్.టి.ఆర్.బాణీ

NTR
యన్.టి.ఆర్.ని సెట్స్ మీద చూసిన ఎవరికైనా ఈ సంగతులన్ని అనుభవ పూర్వకంగా బోధపడతాయి. నటన, దర్శకత్వం,నృత్య దర్శకత్వం, కళా దర్శకత్వం, ఎడిటింగ్ ఒకటేమిటి చిత్ర పరిశ్రమ తాలూకు అన్ని శాఖల మీద నందమూరి తారక రామారావుగారికి విశేషమైన పట్టుంది. ఆయన సెట్స్ మీద వుంటే చిత్రీకరణ హాయిగా సక్రమంగా జరుగుతుంది. పాత్రల తాలూకు,నటన తాలుకూ చర్చ తప్ప మరో విధమైన శబ్దం వినిపించదు. సెట్స్ మీద తన పనిని గురించి చెబుతూ “ఇది వరకు సెట్స్ మీద చాలా ఎమోషనల్ గా వుండే వాడిని , ఎవరైన చిన్న తప్పు చేస్తే కోపంతో గర్జించే వాడిని. కానీ ఇప్పుడు నాలో కోపాతాపాలు లేవు. ఆ కేకలు లేవు. నా అనుభవం తప్పు జరగడానికి అవకాశం ఇవ్వదు. ఒక వేళ తప్పు జరిగినా ప్రశాంతంగా సరిచేస్తాను. కారణం నా మసస్సెప్పుడూ సౌమ్యతతో శాంతితో నిండిపోయి వుంటుంది. సాయంత్రం ఆరు గంటలకల్లా ఇంటి కెళ్ళిపోయి రెండో రోజు చేయబోయే కార్యక్రమాల గురించి ఆలోచిస్తాను.షూటింగుకు కావలసిన ఏర్పాట్లు ఆర్టిస్టుల దుస్తులు వగైరాలు సిద్దం చేసి వుంచమని చెప్పి తొమ్మిది గంటలకు నిద్రపోతాను. మళ్లీ రెండున్నర గంటలకు మేల్కోంటాను. ఇలా నిర్ణీతంగా, నిర్థుష్టంగా జరిగిపోతు ఉంటాయి పనులు. ఒక్క నిముషం కూడా తేడా వుండదు. ఇదో చక్రభ్రమణం”అంటూ చిరునవ్వునవ్వారు. నందమూరి తారక రామారావ్ అన్నయ్యగారు.

రాజకీయ బీజాలు

NTR
ఎన్.టి.ఆర్. రాజకీయ ఇతివృత్తం గల చిత్రాలలో నటించారు. చలనచిత్రాలలో మొదటిసారి మానుకున్న కాలంలోని చివరి చిత్రాలన్నీ కుళ్ళు రాజకీయాలపైనా, వ్యవస్థపైనా తిరుగుబాటుచేసే పాత్రలు ధరించినవే. ఆయా చిత్ర సందర్భాలలో అంకురించి అతని మనస్సును తొందరపెడుతున్న భావాలను మొదటిసారిగా ఒక షూటింగ్ లో ఎన్.టి.ఆర్. బయటపెట్టారు. అలా ఔట్ డోర్ షూటింగ్ కోసం ఒకసారి హిమాలయ ప్రాంతంలోని మనాలికి వెళ్ళ్లారు. అక్కడ షూటింగ్ లోకేషన్ కు వెళ్ళ్లేసందర్భంలో బి.వి. మోహన్ రెడ్డి (తర్వాత మంత్రి) మొదలగు వారితో వేదంతధోరణిలో మాట్లాడారు. మనసులో ఏవేవో భావాలు ఆయన మాటల్లో బయటపడ్డాయి. "తెలుగు ప్రజలు" నన్ను ఇంతగా ఆదరించారు, అభిమానించి అందలం ఎక్కించారు. పేరు ప్రతిష్ట, కీర్తి, సిరిసంపదలు అన్నీ ఇచ్చారు. వారికి నేను ఏమి బదులిచ్చి రుణం తీర్చుకోగలను" అని మధనపడుతున్నట్లు మాట్లాడారు. ఆ సందర్భానికి అనుగుణంగానే బి.వి.మోహన్ రెడ్డి "అన్నగారూ! మీరు కనుక రాజకీయ రంగప్రవేశం చేస్తే ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారు. ఆంధ్ర రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రి" అని తన భవిష్యవాణిని వినిపించారు. రాజకీయాలలో ప్రవేశించాలన్న తన అంతరంగంలోని తొలి ప్రకంపనలను 1980 ప్రాంతాలలో "సర్దార్ పాపారాయుడు" చిత్రం కోసం ఊటీలో షూటింగ్ లో ఉండగా ఎన్.టి.ఆర్. వెల్లడించారు. అదే ఆయన పత్రికాముఖంగా వెల్లడించిన తొలి ప్రకటన. సినిమా పత్రికల విలేఖరులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా"60" ఏళ్ళ్లు నిండిన తర్వాత తాను ప్రజాజీవితంలోకి ప్రవేశించాలనుకుంటున్నానని" తన మనసులోని మాట చెప్పారు. ఆనాటి రాజకీయ వ్యవస్థలోని అస్తవ్యస్త పరిస్థితులను తలచుకుని బాధ ప్రకటించారు. ఈ వార్త ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. తర్వాత చంద్రబాబునాయుడు అల్లుడు కావాడం ఆయన రాజకీయ రంగప్రవేశాన్ని అమితంగా ప్రభావితం చేసింది. కాంగ్రెస్ లోని అస్థిరధోరణులకు విసిగి చాలా మంది ప్రాంతీయపార్టీల గురించి చర్చించసాగారు. అల్లుడు అయిన తర్వాత చంద్రబాబు కూడా ఆయనతో తరచుగా ఈ విషయంలో చర్చించేవారు.
అప్పటికే ఎన్.టి.ఆర్. రాజకీయాలలోకి రాబోతున్నారన్న వార్తలు కాంగ్రెస్ నాయకులను కలవరపరిచాయి. అల్లుడి పెండ్లి రిసెప్షన్ కు ఎన్.టి.ఆర్. బంజారాహిల్స్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అంజయ్య ఎన్.టి.ఆర్.కు రాజ్యసభ సభ్యత్వాన్ని ఎరగా చూపే ప్రయత్నం చేశారు. ఎన్.టి.ఆర్. తిరస్కరించారు. కొడితే కుంభస్థలంలాంటి ముఖ్యమంత్రి అవకాశాన్నే కొట్టాలిగాని ఈ చిన్నా చితకా ఆయనకి నచ్చలేదు. హైదరాబాద్ లో అల్లుడి రిసెప్షన్ సందర్భంలోనే అల్లుడి హొదా, అధికారంలో, పదవిలో ఉన్నప్పటి మజా ఎలా ఉంటుందో ఎన్.టి.ఆర్. కుటుంబం రుచి చూసింది. ఇంతలో చిత్తూరుజిల్లా పరిషత్ ఎన్నికల విషయంలో అంజయ్య, చంద్రబాబునాయుడును సస్పెండ్ చేసారు. అల్లుణ్ణి మళ్ళ్లీ మంత్రివర్గంలోకి చేర్పించడానికి ఎన్.టి.ఆర్. తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరకు తన మిత్రుడు అమితాబ్ ద్వారా అల్లుణ్ణి క్యాబినేట్ లో ప్రవేశపెట్టగలిగారు. అప్పుడు రామారావుకు రాష్ట్ర రాజకీయాలు ఏరకంగా నడుస్తాయో, ఎలా అన్యాయాలు, అక్రమాలు జరుగుతాయో దీనితో అర్థమైంది. అప్పటి రాజకీయం అంటే నలుగురు నాయకులు హైదరాబాద్ లో కూర్చుని, స్వార్థ ప్రయోజనాలకోసం వినోదప్రాయంగా నడిపే చదరంగమని ఆయనకు బోధపడింది. రాష్ట్ర రాజకీయాన్ని ప్రజారాజకీయాలవైపు మలుపుతిప్పే ఆలోచన ఆనాడే ఆయనలో మొలకెత్తింది.

రాజకీయ భావ స్పందనలు

NTR
భవనం వెంకట్రామ్ మంత్రి వర్గ ప్రమాణ స్వీకారోత్స్వానికి ఎన్.టి.ఆర్. రాజభవన్ కు వెళ్ళారు. ఆనాటి ఆవేడుకలు,ఆ రాజవైభవం అతని మనసులో బలమైన ముద్రవేశాయి. రాజకీయ ప్రవేశానికి మరింతపురికొల్పాయి. ఆ తర్వాత నెల తిరగకుండానే రాజకీయరంగ ప్రవేశంచేశారు. ఆయన రాజకీయాలలోకి ప్రవేశిందబోతున్నారుని వినగానే సినీరంగంలో ఆయనకు మరింత క్రేజ్ ఏర్పడింది. నిర్మాతలు చాలామంది ఆయన కాల్ షీట్స్ కోసం ఎగబడ్డారు. వారంతా ఆత్మీయులే! వారిని కాదనలేక ఒక ఉపాయం ఆలోచించి నలుగురు నిర్మాతలు కలిసి ఒకే చిత్రం ప్లాన్ చేసుకోవలసిందిగా సూచించారు. అలా నిర్మాణమైన చిత్రమే "నాదేశం" తాను షూటింగ్ లో ఉన్నా రాజకీయాలను గమనిస్తూ వచ్చారు. కాంగ్రెస్ రాజకీయాలు దిగజారిపోవటం, పరిపాలన పలచనైపోవటం వంటి పరిస్థితులు ఆయనని తొందరపెట్టాయి. ప్రజలనుండి ఒత్తిడీ, ఆహ్వానాలు పెరిగాయి.

"తెలుగుదేశం" అవతరణ

NTR
1982 మార్చి 21 తేదీన ఎన్.టి.ఆర్. జర్నలిస్ట్లులందరికీ పిలిచి రామకృష్ణ స్టూడియోలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో తన గురించి తన కుటుంబం గురించి, తన ఆస్ఠిపాస్తుల గురించి, ప్రజలు చూపే ఆదరాభిమానాలకు, ప్రజానేవచేసి రుణం తీర్చుకోవాలనుకుంటున్న తన తపన గురించి వివరించారు. నటజీవితం విరమించుకున్నారు. పూర్తికాలం ప్రజలకోసం పనిచేయాలని అనుకున్నారు. పరోక్షంగా రాజకీయాలలోకి రాబోతున్నట్లు తెలిపినా, ఎన్ని ప్రశ్నలు వేసినా, రాజకీయ రంగప్రవేశం గురించి సూటిగా మాట్లడలేదు. 1982 మార్చి 29న కొత్తపార్టీ ఏర్పాటుకు సారథ్యసంఘం ఏర్పడింది. దానికి అధ్యక్షుడు ఎన్.ట్.ఆర్. కార్యదర్శి నాదెండ్ల భాస్కరరావు. మధ్యాహ్నం 2-30 గం. లకు కార్యకర్తలు, ఇతర జనంతో కూడిన బహిరంగ సభలో ఎన్.టి.ఆర్. ఉద్విగ్నంగా మాట్లాడుతు తాను "తెలుగు దేశం పార్టీ" అనే కొత్తపార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆప్రకటనకు హర్హధ్వానాలతో జనామోదం లభించింది. తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదం ఆనాటి నుండి ఊపందుకుంది.
NTR
ఒక కొత్త రూపంతో, కొత్త నినాదంతో, కొత్త ఒరవడితో, ఎన్.టి.ఆర్. ఒక మహొత్తుంగ తరంగమై లేచారు. ఆయన ఆశయాలకు జనం జేజేల వర్షం కురిపించారు. వర్ణ, వర్గ వివక్షలు ఏమీ అంటని మహొద్యమం అది. ఆయన సమ్మోహన శక్తికి తోడుగా, శక్తిహీనమై పలుచబడిపోయిన కాంగ్రెస్ అశక్తత కూడా ఆయన ఉద్యమానికి బలమైన ఊపిరిపోసింది. కాంగ్రెస్ నుండి కొంతమంది ప్రముఖ నాయకులు తెలుగుదేశంలో చేరారు. ఆయన పార్టీ ఫిరాయింపులపై ఆధారపడలేదు. ఆసక్తి కూడా చూపలేదు. కొత్తరక్తం కావాలనే కోరుకొన్నారు. అభిమాన సంఘాలు రామదండుగా పనిచేశాయి. పార్టీ నిర్మాణం రాష్ట్రస్థాయి నుండి గ్రామ స్థాయికి పాకింది. 1982 ఏప్రిల్ 11వ తేదీన నిజాం కాలేజీ గ్రౌండ్స్ల్ల్ల్లో లక్షలాది జనంతో చారిత్రాత్మకమైన మొట్టమొదటి మహాసభ - మహానాడు విజయవంతం అయింది. రామకృష్ణా స్టూడియో నుండి నిజాం కాలేజీ వరకు కొనసాగిన ర్యాలీ హైదరాబాద్ వీధులను దద్దరిల్లజేసింది. ఆ సభలో ఎన్.టి.ఆర్. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి, వారికి ఒక గుర్తింపు, గౌరవం తేవటానికి కుళ్ళ్లిపోయిన పాత వ్యవస్థను కూకటి వేళ్ళ్లతో పెకలించి నూతన వ్యవస్థను నిర్మించడానికి తాను కంకణం కట్టుకున్నానన్నారు. ఆయన మహొద్వేగంతో చేసిన తొలి ప్రసంగం జనాన్ని బాగా ఆకట్టుకుంది. అవినీతి, అక్రమాలకు తావులేని స్వచ్చమైన పాలన అందించడం కోసమే వచ్చానన్నారు. విజయవంతమైన ఆసభ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. పార్టీ జెండా, సైకిల్ గుర్తు ఏర్పడ్డాయి.

తారక రాముడి మొదటి రాజకీయ ప్రచారం 70 రోజులు 35వేల కి.మీటర్లు

NTR
జనవరి 3వ తేదీ నుండి 70 రోజులపాటు అవిశ్రాంతగా రాష్ట్రమంతటా పర్యటించారు. 35000కి.మీ. తిరిగారు. మూలమూలకూ వెళ్ళి ఆయన సందేశాన్ని ప్రజలకు అర్థమయ్యే ధోరణిలో వాళ్ల హృదయాలకు హత్తుకునేలా బోధించారు. మహత్మగాంధీ తర్వాత ప్రేమాభిమానాలతో ప్రజల హృదయాలలో స్థానం సంపాదించినది నందమూరి తారక రామారావు గారే.

ఆయన ప్రచారానికి వెళ్ళేటప్పుడు 40 సంవత్సరాలకు పూర్వం ఆయన కొనుగొలు చేసిన చెవర్‌లేట్ వ్యాన్ 1982 ఆగస్టులో 10,000 రూపాయలతో బాగుచేయించి ప్రచారానికి కావలసిన అన్ని సౌకర్యాలతో సిద్దపరచారు. అందులో ప్రచారానికి వెళ్ళే ముందు ఖాకీ దుస్తులు రెండు జతలు ,వెన్నె,తేనే, నిమ్మకాయల రసం, సోడా ఇవన్నీ వ్యాన్‌లో భద్రపరిచి వుంచేవారు. అవసరమున్నప్పుడల్లా వాటిని ఉపయోగించేవారు. దారిలో స్త్రీలు ,పురుషులు ఆబాలగొపాలం ఆయనకు దారి పొడవునా పుష్పహారాలతో ,మంగళహరతులతో జయ జయ ద్వానాలతో నాదస్వరాలతో ఆహ్వానించారు. ఆయన కోసం దారి పొడగునా ఎప్పుడు వస్తాడో ,ఎప్పుడు కనబడుతాడో అనే ఆశతో గంటల తరబడి వాననక,ఎండనక,రాత్రీ,పగలనక వేచి వుండేవారు. వెళ్ళిన ప్ర్తతిచోట పార్టీ కార్యకర్తలకు తన ఉపన్యాసాల క్యాసెట్‌లను, పోస్టర్‌లను, వాళ్లు అనుసరించవలసిన కార్యక్రమాలకు కావలసినవి ఇచ్చి బయలు దేరేవారు. ఆవ్యాన్ లోనే అల్యూమినియంతో తయారు చేసిన నిచ్చ్రెన పైన కూర్చోవడానికి ఆసనం ,లౌడ్‌స్పీకర్లు,మైక్ వంటి సౌకర్యాలన్నీ వున్నాయి. ప్రచార రథం పరిసరాలకు రాగానే ఇసుక వేస్తే రాలనంత జనం క్షణాల్లో పోగయ్యేవారు.యువకులు,పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా వేల సంఖ్యలో ప్రజలు తండోప తండాలుగా ఆ రథం చుట్టూ చేరిపోయేవారు.రామారావు గారి వాక్చాతుర్య ప్రసంగాలకు మంత్రముగ్ధులయ్యేవారు.

ప్రచార ప్రభంజనం

NTR
1982 మే 27వ తేదీన ఎన్.టి.ఆర్. 60వ జన్మదిన వేడుకలు మహానాడు రూపంగా తిరుపతిలో జరిగాయి. పార్టీ కార్యవర్గ, సర్వసభ్య సమావేశాలు విజయవంతం అయ్యాయి. జన సముద్రాన్ని చూసి ఆయన ఉత్సాహం ఉత్తుంగ కెరటంలా ఎగిసిపడింది. తిరుపతి సభావేదికపై నుండే ఆయన ప్రత్యర్థి రాజకీయాలపైన సమరశంఖం ఊదారు. పార్టీ ప్రచార జైత్రయాత్రకు నాంది పలికారు. ఆంధ్రప్రదేశ్ అంతటా పార్టీ ప్రచారానికి సన్నాహాలన్నీ జరిగాయి. పర్యటనకు అన్ని హంగులతో ఒక వ్యాన్ "చైతన్యరథం"గా రూపుదిద్దుకుంది. అందులో సకల సదుపాయాలు సమకూర్చారు. దాన్ని ఒక అందమైన ఆఫీసు గదిలా, విశ్రాంతి గదిలా మార్చారు. ఎక్కడా దేనికీ వెదుక్కోనవసరం లేకుండా, ఎవరిపైనా ఆధారపడే పని లేకుండా అందులో ఏర్పాట్లు చేశారు. "చైతన్యరథం" ప్రచారంకోసం ప్రజలమధ్యకు దూసుకుపోయింది. ఆయన సభకు వేదిక అవసరంలేదు. ఒక చౌరస్తా అయినా, ఏవిధమైన విశాలమైన బహిరంగ ప్రదేశమైనా చాలు. అర్థరాత్రి అయినా, మధ్యాహ్నమైనా సభ జరిగేది. ఆయన రాకకోసం గంటలతరబడి వేలజనం పడిగాపులుపడి ఎదురుచూసేవారు. ఆయన ఉపన్యాసం ఆవేశంతో సాగేది. అది ఆయన ఊపిరి. ఉపన్యాసం అనర్గళంగా సాగేది. ఉపన్యాసంలో తనగురించి, ఆనాటి కుళ్ళ్లు రాజకీయాల గురించి, తాను అందించబోయే ప్రజోపయోగ పాలన గురించి వివరించేవారు. ఆయన మాట ఈటెలవలే ఉండేది. సూటిగా, ఘాటుగా ఉండేది, ఉద్వేగంతో నిండేది, వేడి పుట్టించేది.
NTR
ఆయన అభిప్రాయాలలో నిజాయితీ కనిపించేది. ఆయన రూపం మాత్రమే కాదు, కంఠస్వరం, మాట కూడా గంభీరంగా ఉండేది. గర్జిస్తున్నట్టూ, ప్రత్యర్థులను గద్దిస్తున్నట్టు ఉండేది. పర్యటనలో కొండలు, కోనలు, వాగులు, వంకలు, అన్నింటినీ అధిగమించి, మారుమూల పల్లేలను కూడా వదిలిపెట్టకుండా తిరిగి ప్రచారం చేశారు. అంత విస్తృతంగా జనం మధ్యకు వెళ్ళ్లి ప్రచారం చేసిన రాజకీయ నాయకుడు మనదేశంలోనేకాదు, ప్రపంచంలోనే మరొకరు లేరు. ప్రచారంలో శంకరంబాడి సుందరాచార్య "మాతెలుగుతల్లికి మల్లెపూదండ" గీతానికి, వేములపల్లి శ్రీ కృష్ణ రాసిన "చెయ్యెత్తి జైకొట్టు" గీతానికి, జీవం పోశారు. ఆయన మార్గాన్నీ పద్ధతులను దేశంలోని నాయకులందరు అనుసరించారు. అన్నీ కొత్త పద్ధతులే, ఆంధ్ర దేశాన్ని మూడు సార్లు చుట్టివచ్చి 40వేల కిలోమీటర్లు ప్రయాణించారు. ఆ ఓపిక, ఆ దీక్ష అపూర్వం, అనితరసాథ్యం. పార్టీలో ఆయనే హీరో, మిగతా వారందరూ జీరోలయ్యారు, ఆయనకు మిగతానేతలకు అంతస్తులో తేడా బాగా వచ్చింది. ఇక జనం ఆయన వస్తున్నారంటే చేతిలో ఉన్న పనులన్నీ వదిలి, సర్వం మరచి, పరుగులు పెట్టి వచ్చేవారు. రోడ్డుపై బారులు తీరి నిలబడేవారు. ఎన్.టి.ఆర్. తాను గెలిస్తే ప్రవేశపెడతానన్న పథకాల్లొ ముఖ్యమైనవి కిలోకు రెండు రూపాయల బియ్యం పథకం, బడిపిల్లలకు మధ్యాహ్న భొజన పథకం, మనిషికి ప్రాథమిక అవసరాలైన కూడు, గూడు, గుడ్డ. "పేదవాడికి పట్టెడన్నం పెట్టాడమే కమ్యూనిజం అయితే నేనూ కమ్యూనిస్టునే" అన్నారు. ఎన్.టి.ఆర్. ఆకర్షణతోపాటు ఈ అంశాలన్నీ బాగా నచ్చాయి, ఆకర్షించాయి. ఎన్.టి.ఆర్. తమ జీవితాలపట్ల దేవుడు అనే నిర్ణయానికి వచ్చారు. హృదయపూర్వకంగా ఓట్ల వర్షం కురిపించారు.

ఓట్ల వర్షాభిషేకంతో "ముఖ్యమంత్రి"

NTR
1983 జనవరి 5వ తేదిన జరిగిన పోలింగ్ లో తెలుగుదేశం సూపర్ హిట్ అయింది. నిలుచున్న అబ్యర్థులను చూసి ఎవరూ ఓటు వేయలేదు. ప్రతి ఓటరు తాను ఎన్.టి.ఆర్. కే ఓటు వేస్తున్నాననుకుని వేశారు. ప్రతిపక్షం వారి అంచనాలను, ఇతరుల నెగెటివ్ అంచనాలను మించి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం 203 స్థానాలను గెలుచుకుంది. చాలా ప్రాంతాల్లో ఎన్నికల్లో ఎన్.టి.ఆర్. నిలబెట్టిన రాజకీయ అనుభవం లేని నాయకులు కూడా గెలిచారు. అబ్యర్థుల్లో మూడు వంతులకు పైగా కొత్తవారే. ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో అపూర్వఘట్టం. చాలా నియోజకవర్గాలలో వారెవరో కూడా తెలియని నాయకులు గెలిచారు. అత్యధికులు యువకులు, విద్యాధికులు, 125 మంది పట్టభుద్రులు, 20 మంది వైద్య పట్టభద్రులు, 8మంది ఇంజనీర్లు, 28మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, కేవలం 9 నెలల ప్రాయంగల ప్రాంతీయ పార్టీ, వందేండ్ల చరిత్రగల జాతీయపార్టీని చిత్తు చిత్తుగా ఓడించింది. ఎన్.టి.ఆర్. విశ్వవిఖ్యాత ఎన్నికల విజేతగా విరాజిల్లారు. కనివిని ఎరుగని ప్రజారాజకీయాలకు ఎన్.టి.ఆర్. నాంది పలికారు. రాజ్ భవన్ ను ప్రజలమధ్యకు తెచ్చారు. రాజకీయాలకు కొత్త నిర్వచనం పలికారు, ఆంధ్రప్రదేశ్ లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. అశేష ప్రజల సమక్షంలోనే ఎన్.టి.ఆర్. మంత్రి వర్గం ముందెన్నడూ లేనివిధంగా లాల్ బహదూర్ స్టేడియంలో 15మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేస్తుంటే స్టేడియం, లక్షలాది ప్రజల ఆనందేతిరేకంతో దద్దరిల్లింది.

మొదటిసారి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చేసిన ప్రసంగం

NTR
మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్టీఆర్ 1983 జనవరి 9 న లాల్‌బహదూర్ స్టేడియంలో అశేషజనవాహిని ఉద్దేశించి చేసిన ప్రసంగం. మహొత్తుంగ జలధి తరంగాల్లో ఉత్సాహంతో ఉప్పొంగుతున్న ఈ జనసందోహాన్ని చూస్తూంటే నాలో ఆవేశం తొణికిసలాడుతున్నది. పుట్టి ఏడాది కూడా నిండని ‘తెలుగుదేశం’ఇంత త్వరలోనే అధికారంలోకి రావడం ప్రపంచ చరిత్రలోనే అపూర్వం. ఒక్క తెలుగువాళ్ళే అసంభవాన్ని సంభవం చేయగలరని, తెలుగు పౌరుషం దావాగ్నిలా, బడబాగ్నిలా ప్రజ్వరిల్లి అక్రమాలను, అన్యాయాలను దహించగలదని రుజువు చేశారు. అందుకు తెలుగు బిడ్డగా నేను గర్విస్తున్నాను. నాకు నా జాతి చైతన్యం మీద, పరాక్రమం మీద,అచంచలమైన నమ్మకముంది. నా అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఆగ్రహిస్తే వాళ్ళ హృదయాల్లోంచి లావా ప్రవాహాలు వెలికి చిమ్ముతాయని నాకు తెలుసు. శౌర్యం విజృంభిస్తే ఎంత శక్తివంతమైన ఆక్రమ శక్తి ఐనా నేల కరుస్తుందని లక్షలాది ప్రజలు ఆచరణలో నిరూపించారు. అందుచేతనే మీ ముందు వినమ్రుడనై చెబుతున్నాను ఆది మీ విజయం.. ఆరుకోట్ల తెలుగు వీర ప్రజానీకం సాధించిన అద్బుతమైన, అపూర్వమైన విషయమని మనవి చేస్తున్నాను. ఈ మహత్తర చారిత్రాత్మక విజయంలో నా పాత్ర ఎంత? మహా సముద్రంలో నీటి బిందువంత మాత్రమే. కాబట్టి తెలుగుదేశం గెలుపు తెలుగు ప్రజలందరిది గెలపని ప్రకటిస్తున్నాను.

ఈ ఎన్నికల్లో జనబలం అన్నింటినీ జయించింది. తెలుగు వారి అత్మాభిమానం అంగడి సరుకు కాదని తెలుగువాడు మూడోకన్ను తెరిస్తే అధర్మం,అన్యాయం, కాలి బూడిదై పోతాయని మన రాష్ట్ర్రంలో విజృభించిన జన చైతన్య ప్రభంజనం చాటి చెప్పింది. దాని ముందు కొండలు కూడా బెండులాగా ఎగిరిపోతాయాని రుజువైంది. మీరిచ్చిన ప్రోత్సహ తరంగాల మీదనే నా ప్రచార జైత్రయాత్ర అవిఘ్నంగా అప్రతిహతంగా సాగిపోయింది.

నా పట్ల ప్రజలు ప్రదర్శించిన వాత్సల్యానికి, చేకూర్చిన ఈ అద్బుత విజయానికి ఎలా,ఏమని కృతజ్ఞత చెప్పాలో నాకు తోచడం లేదు. నిజానికి మీ ప్రేమానురాగాల గిరించి వర్ణించడానికి మాటలు చాలవు. మీ ఋణాన్ని తీర్చుకోవడానికి నాకు ఒక జన్మ చాలదు. మళ్ళీ జన్మంటూ వుంటే తెలుగు తల్లికి తనయుడుగా పుట్టి మీ సేవలో నా జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని ఉంది. నాలోని ప్రతి అణువును ప్రతి రక్తపు బొట్టునూ మీ కోసం ధారబోయాలని ఉంది. ఈ ఎన్నికల రణరంగంలో నన్ను అభిమానించి, విజయోస్తు అని అశీర్వదించి, రక్తతిలకం తీర్ఛి మంగళహారతులు పట్టిన తెలుగు మహిళలకు ప్రత్యేకించి మా అభినందనలు అర్పిస్తున్నాను. ఇక తెలుగువాడినీ, వేడిని ప్రతిబింబించే ఉడుకు నెత్తురు ఉప్పొంగే నవయువతరం గురించి ఏం చెప్పాలి? వాళ్ళు వీరభద్రుల్లా విక్రమించారు. తెలుగుదేశం విజయసాధనలో అగ్రగాములయ్యారు. అలాంటి నా తమ్ముళ్ళకు నేను చెప్పేదోకటే. ఇది మీ భవిష్యత్తుకు మీరు వేసుకున్న వెలుగుబాట. పోతే చిన్నారి చిట్టి బాలురున్నారు. వాళ్ళకు ఓట్లు లేవు. అయినా శ్రీరాముని సేతుబంధనంలో ఉడత సహాయంలా ఈ బుడతలు చేసిన కృషికి నేను ముగ్దుణ్ణయ్యాను. రేపటి వేకువ విరిసే ఈ లేత గులాబీ మొగ్గలను ప్రేమాభిమానాలతో ఆశీర్వదిస్తున్నాను.

తెలుగుదేశం ఎన్నికల ప్రణాళికలో రాష్ట్ర్ర అభివృద్దికి అనేక అంశాల కార్యక్రమం ఉంది. రాష్ట్ర్ర్ర ప్రజనీకం నా మీద, తెలుగుదేశం మీద ఎన్నో అశలు పెట్టుకున్నారని నాకు తెలుసు. ప్రణాళికలోని వివిధ అంశాలను వాటి ప్రాముఖ్యాన్ని బట్టి క్రమంగా అమలు జరుపుతాము. ఈ విషయంలో ఏరుదాటి తెప్ప తగలేసే తప్పుడు పని చేయబోనని హామి ఇస్తున్నాను. ప్రధానంగా సమాజంలో అట్టడుగున ఉన్న బడుగు వర్గాల అభివృద్దికి మా శయశక్తులా కృషి చేస్తాం. త్రాగేందుకు మంచి నీళ్ళకు సైతం నోచుకోని ఉళ్ళున్నాయి. తలదాచుకోను తావులేని నిర్భాగ్య జీవులున్నారు. రెక్కాడినా డొక్కాడని శ్రమజీవులు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. వాళ్ళను వేంటనే అదుకోవాలి. ఆ సమస్యను పరిష్కరించాలి గాంధీజీ గ్రామ స్వరాజ్యం గురించి కలలు గన్నారు. అదే రామరాజ్యం అన్నారు. తెలుగుదేశం గ్రామాభ్యుదయం కోసం నిర్విరామంగా పాటుపడుతుంది. బడిపిల్లలకు ఉచిత మధ్యాన్న భోజన పథకం, రెండు రూపాయలకు కిలో బియ్యం పేద ప్రజలకు ఇప్పించడం సక్రమంగా అమలు జరుపుతాము. వ్యవసాయ, పరిశ్రమలు సమాతుకంలో సత్వరాభివృద్దికి కృషి చేస్తాము. రాష్ట్ర్రంలో వెనుకబడిన, కరువు కాటకాలకు నిలయమైన ప్రాంతాల అభివృద్దికి శ్రద్ద తీసుకుంటాము. ఏ రూపంలోనూ ప్రాంతీయ సంకుచిత తత్వాలకు ఆసాధ్యం లేకుండా ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్దికి దీక్ష వహిస్తాము.

ఈ కార్యక్రమం అనుకున్న విధంగా అమలులోనికి రావాలంటే పాలన వ్యవహారాలు సక్రమంగా సజావుగా సాగాలి. ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలి. ఉద్యోగులు ప్రజా పీడకులు కాకుండా, వాళ్ళ ఉప్పు తింటున్న సేవకులుగా భావించుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు మన పాలనా వ్యవస్థ అలా లేదు. అధికార దర్పం, పనిలో జాప్యం, లంచగొండితనం వగైరా నానారకాలైన జాడ్యాలకు కేంద్రమైంది. ముప్పై ఐదు ఏళ్ళుగా పొరలు పొరలుగా పేరుకోని ఘనీభవించిన కాలుష్యాన్ని ప్రక్షాళనం చేయవలసి వుంది. అయితే ఇది అనుకున్నంత తేలిక వ్యవహారం కాదనీ నాకూ, మీకు కూడా తెలుసు. తెలుగునాట ప్రవహించే సమస్త పవిత్ర నదీ జలాలన్నింటితో కడిగినా ప్రక్షాళనం కానంతటి కల్మషం పేరుకుని వుంది. ఇది తెలుగుదేశంకు సక్రమించిన వారసత్వం. కాబట్టి ఒక్క రోజులో ఈ పాలన వ్యవస్థను మార్ఛడం అయ్యే పనికాదు. అయితే అత్మవిశ్వాసం నాకు ఉంది. మన అధికారుల అండతోనూ ఈ కృషిలో జయప్రదం కాగలమన్న కక్ష, కార్పణ్యాలే బహుమతులై మిగిలాయి. తెలుగుదేశం పాలనలో అన్ని విధాలా ప్రోత్సాహంగా ఉంటుంది. అలాగే అవినీతికి అలవాటు పడిన ఉద్యోగులకు కూడా ఈ సంధర్బంలో ఒక హెచ్చరిక చేయదలచుకున్నాను. గతంలో ఏ అనివార్య రాజకీయ కారణాలవల్లనో, ఇతర కక్కుర్తివల్లనో అక్రమాలకూ,అధికార దుర్వనియోగానికి పాల్పడి వుండవచ్చు. వాళ్ళు ఇప్పుడైన పశ్చాత్తాపం చెంది తమ పద్దతులు మార్చుకుంటే మంచిది. లేకపోతే అలాంటి విషయంలో నిర్థాక్షిణ్యంగా వ్యవహరించి తీరుతాము. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో మమ్ము ఏ శక్తి అడ్డలేదు. కానీ వాళ్ళను ఏ శక్తి రక్షించలేదని కూడా తెలియ జేస్తున్నాను. అన్నిశాఖల ప్రభుత్వోద్యోగులు మాతో సహకరించి తెలుగునాడు సర్వతోముఖ వికాసానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఉద్యోగుల సాధక బాధాకాలను మా ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తుంది. ముఖ్యంగా చాలీ చాలనీ జీతాలతో బాధపడే వాళ్లకు తగిన సహాయం చేస్తుంది. అదే సమయంలో విద్యుక్త ధర్మ నిర్వహణలో నిజాయితిగా, సమర్థంగా పనిచేయాలని కోరుతుంది. అనేక రంగాల్లో అనుభవజ్ఞులూ, మేధావులూ మన రాష్ట్ర్ర్రంలో వున్నారు. వాళ్ళందరి సహకారాన్ని మేము సవినయంగా అర్థిస్తున్నాను.

రాను రాను మన రాష్ట్ర్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని,ప్రజల మాన , ధన ప్రాణాలకు, స్త్ర్రీల శీలానికి రక్షణ లేకుండా పోయింది. అందరికి తెలుసు. మన సమాజంలో అరాచక, హింసా, దౌర్జన్యశక్తులు వికట తాండవం చేస్తున్నాయి. ఈ విషయంలో మా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. బందిపోట్లను, గూండాలను సమస్త సంఘ వ్యతిరేకులను నిర్థాక్షిణ్యంగా అణిచి వేసే విషయంలో అధికారులు తీసుకునే చర్యలను గౌరవించి అభినంధిస్తుంది.పోలీస్ శాఖలో ఉత్సాహవంతులు, సమర్థులు, సాహసికులూ, నీతిపరులైన వాళ్ళున్నారు. అలాంటి వాళ్ళను మా ప్రభుత్వం అభిమానిస్తుంది, ఆదరిస్తుంది. ప్రజలను రక్షించవలసిన ఈ శాఖలో ఉన్న అవినీతిని నిర్మూలించేందుకు, పోలీసుల జీతాలను బాగుపరిచేందుకు ప్రయత్నిస్తాము.పోలీసులను ప్రజలు నిజంగా తమ రక్షకులు అనుకునేటట్లు ఆ శాఖను తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం. అందుకు సహకరించవలసిందిగా ఆ శాఖ ఉద్యోగులందరిని కోరుతున్నాను.

మన తెలుగునాడు వ్యవసాయ ప్రధానమైంది. అయినా రైతాంగం గిట్టుబాటు ధరలేక తగినంత పెట్టుబడి లేకా నానా ఇబ్బందులూ పడుతోంది. తెలుగుదేశంపార్టీ వ్యవసాయాభివృద్దికి, దానితోపాటు సత్వర పారిశ్రామికాభివృద్దికి పాటు పడుతుంది. మా ఎన్నికల ప్రణాళికలో ఈ రంగాలలో తీసుకోవలసిన చర్యల గురించి పేర్కొన్న అన్ని అంశాలను అమలు జరుపుతామని మనవి చేస్తున్నాను. రాష్ట్ర్ర్రాభివృద్దికి అవసరమైన అన్ని వనరులూ మనకున్నాయి.వాటిని నిర్ణీత పథకం ప్రకారం పట్టుదలతో అమలు జరపడం ద్వారా పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని అరికట్టవలసి ఉంది. ఇలాంటివే ఇంకేన్నో జటిల సమస్యలు మన ముందున్నాయి. వాటన్నింటిని ఓర్పుతో నేర్పుతో పరిష్కరించుకోవలసి ఉంది. ఈ సందర్భంలో తెలుగుదేశంను అనూహ్యమైన మెజారిటీతో గెలిపించిన తెలుగు ప్రజలందరికి నాదో విన్నపం. ఈ విజయానికి మీరే కర్తలు. అలాగే అభివృద్దికీ మీరే కర్తలు అని సవినయంగా మనవి చేసుకుంటూ శలవు దీసుకుంటున్నాను.జై తెలుగుదేశం!జై జై తెలుగుదేశం!!

ఆడపడుచులకు సముచిత స్థానం

NTR

రామారావుగారికి తెలుగు ఆడబడుచులంటే అమితమైన గౌరవాభిమానాలున్నాయి. వారి పట్ల ఆయనకు మక్కువ ఎక్కువ. మన సమాజంలో ఇంచుమించు సగం మంది స్త్రీలు వున్నా యింతకాలం వారిని గురించి ఎవరూ సరిగా పట్టించుకోలేదని,వారి బాగోగులు కోసం సంక్షేమం కోసం, అభ్యుదయం కోసం జరగవలసిన కృషి జరగలేదని ‘అన్నగా’ ఆయన బాధ పడుతుండేవారు. స్త్రీ అర్థికంగా తన కాళ్లమీద తాను నిలబడినప్పుడు, రాజకీయ సామాజిక జీవన రంగాలలో పురుషుడి సరసన ధీటుగా నిలబడినప్పుడు స్త్రీ పురోగమించగలుగుతుంది. ప్రగతిని సాధించగలుగుతుంది.

ఇంతవరకు అక్కచెల్లెండ్రకు సరైన న్యాయపరమైన జీవనం కల్పించబడలేదు. మగవారితో పాటు మగువలకు కూడా సమానమైన హక్కులు కల్పించడం అవసరం. తల్లిగా,సోదరిగా,భార్యగా, కూతురుగా పెనవేసుకోని తన జీవితాన్ని పరిపూర్ణం చేయడానికి స్త్రీ ఎంతచేస్తున్నదో ఆ విషయాన్నంతా విస్మరించాడు పురుషుడు. స్త్రీని ఎన్నో అన్యాయాలకు గురిచేశాడు. ఎన్నివిధాలుగా గురిచేశాడో ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. తిట్టడం,కొట్టడంతో పాటు అవమానించడం, అవహేళన చేయడం, మానభంగం చేయడం కట్నాల కోసమని నిలువునా హత్యచేయడం మొదలైన అనేక ఘాతుక కృత్యాలను పురుషుడు అమెమీద అమలుచేస్తున్నాడు. స్త్రీ ఎందుకింత హీనంగా,దీనంగా దిగజార్చబడిందా అని జాగ్రత్తగా చూస్తే ప్రధానంగా అమెకు తన కాళ్లమీద తాను నిలబడే అర్థిక స్వాతంత్ర్యం లేక పోవడమేనని స్పష్టమౌతుంది.

చిన్నప్పుడు తండ్రిమీద, సంసారజీవితంలో భర్తమీద, వృద్దాభ్యంలో కొడుకుమీద అధారపడి బ్రతకడమే స్త్రీ జీవితానికి అర్థంగా ఇంతకాలంగా కొనసాగుతున్న స్త్రీ పురుషుల అసమాన సహజీవన విధానాన్ని సమాన సహజీవనంగా రూపోందించాలని ఆయన మనస్సు ఆడపడుచులకై అక్క చెల్లెండ్రకై తహ తహ లాడింది. సామాజిక,అర్థిక,రాజకీయాది సమస్త జీవిత రంగాల్లోనూ స్త్రీ పురుషులు అన్యోన్యంగా సమాన గౌరవ మర్యాదలు గల హోదాను అనుభవించడానికి వీలుగా అనేక రకాల అచరణ కార్యక్రమాలను చేపట్టారు. కొడుకులతో పాటు కూతుళ్లకు కూడా వారసత్వ సంపదలో సమాన హక్కులు కల్పిస్తూ శాసనం జారీ చేయించారు. ఉద్యోగాలలో 30శాతం పోస్టులను మహిళలకు కేటాయించారు. స్త్రీలకు వృత్తి పనులు నేర్పే శిక్షణా సంస్థలు బాల మహిళా ప్రగతి ప్రాంగణాలు, స్త్రీలకోసం ప్రత్యేకంగా శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. గ్రామపంచాయితీలలో,మండల ప్రజా పరిషత్తులలో,నియోజకవర్గాలలో మహిళలకు కొన్ని పదవులను ప్రత్యేకించారు. అంతేకాక విద్య,సారస్వత రంగాలలో క్రుషి చేసిన మహిళలను సత్కరించి ప్రోత్సహించారు.

“అబల”అనే పదానికి ఇక ముందు ఆస్తిత్వం లేకుండా చేయాలన్న ధ్రుడ సంకల్పం ఆయనది. ఆయన చేపట్టిన ప్రతీ పనీ అతి ముఖ్యమైనదే. అందులో గాఢాంధకారంలో ఆవేదనతో,నిరాశతో,నిస్పృహతో,నిర్వేదంతో మగ్గుతున్న ఆడపడుచుల సముద్దరణే లక్ష్యం.ఆ బాధిత ప్రజావళికి జీవితాల్లో ఆశాజ్యోతులు వెలిగించాలి అనే పట్టుదల ఆయనది. ఆయన సేవా నిరతిని గుర్తించి ఆయన చిత్తశుద్దిని గ్రహించి తెలుగింటి ఆడపడుచులు ఆయనను “అన్నా”అని అప్యాయంగా పిలుస్తున్నారు.


0 comments: